ఇక ప్రభుత్వం అంటే ‘ఎల్జీ’యే : కేంద్ర హోంశాఖ

ఇకపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరే. ప్రభుత్వం అంటే కూడా ఆయనే. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ చట్టం 2021 ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం ఢిల్లీలోని ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఇకపై లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి అని పేర్కంది. ఏప్రిల్ 27 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చిందని హోంశాఖ పేర్కొంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, శాసన సభల నుంచి కార్యనిర్వాహక అధికారాలను ఎల్జీకి కట్టబెడుతూ ఈ చట్టాన్ని పార్లమెంట్ గత నెలలో ఆమోదించింది. ఈ సమయంలో విపక్షాలన్నీ కేంద్రంపై తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. ఈ చట్టంతో ఢిల్లీ ప్రభుత్వం ఇకపై కార్యనిర్వాహక చర్యలను చేపట్టడానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సీఎం, ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి ఎల్జీ అనుమతి తప్పనిసరి.