ఎంపీలకు షాక్.. కేంద్రీయ విద్యాలయాల్లో కోటాను
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా కింద ఓటాయించే ప్రత్యేక సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సర్క్యూలర్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేవీఎస్ కేటాయిస్తూ వస్తోంది. అయితే ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తూన్నారు. ఓవైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.
లోక్సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 245 మంది కలిసి ఏటా మొత్తం 7,880 మంది విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ఎంపీల కోటాలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. దీంతో మొత్తం కోటానే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.













