కుంభమేళా ముగిసినట్టేనా? మోదీ ట్వీటే అందుకు నిదర్శనమా?
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనే హరిద్వార్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఈ కుంభమేళాలో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్ అని కూడా పరీక్షల్లో తేలింది. అంతేకాకుండా దాదాపు 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాపై ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూస్తే కుంభమేళాను ఆపాలని మోదీ పరోక్షంగా సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా సమయం నడుస్తోందని, అందుకే కుంభమేళాను ప్రతీకాత్మకంగానే, ఓ సంకేతంగానే చూడాలని, అలాగే జరపాలని అభ్యర్థించారు.
స్వామి అవధేశానందకు ఫోన్ చేసిన మోదీ
కోవిడ్ సమయంలో కుంభ మేళా జరుగుతున్న నేపథ్యంలో నిరంజనీ అఖాడా అధ్యక్షుడు స్వామి అవధేశానంద గిరి మహారాజ్‌తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘ఆచార్య మహా మండలేశ్వర్ అవధేశానంద గిరి మహారాజ్‌కు నేను ఫోన్ చేశాను. సాధువుల ఆరోగ్యం గురించి వాకబు చేశాను. సాధువులందరూ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకూ కుంభమేళాలో సాధువులలు రెండు సార్లు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక కుంభమేళాలో జరిగే క్రతువులను ఒక ప్రతీకగా మాత్రమే జరుపుదాం. దీని వల్ల కరోనాపై పోరాడేందుకు బలం సిద్ధిస్తుంది. ఇదే విషయాన్ని స్వామీజీతో విన్నవించాను’’ అని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
స్పందించి, ట్వీట్ చేసిన అవధేశానంద
ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిపై స్వామి అవధేశానంద స్పందించారు. ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిని తాము సకారాత్మకంగానే తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్నింటి కంటే ప్రాణాలు ముఖ్యమని, పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని స్వామీజీ విజ్ఞప్తి చేశారు. కుంభమేళాకు హాజరయ్యే వారందరూ విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అవధేశానంద విజ్ఞప్తి చేశారు.
30 మంది నాగసాధువులకు కరోనా
కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగ సాధువులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాదాపు అన్ని అఖాడాలోని సాధువులు వైరస్ బారిన పడ్డారని హరిద్వార్ ముఖ్య వైద్యాధికారి పేర్కొన్నారు. మిగితా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిరంజనీ అఖాడా సాధువుల బృందం కుంభమేళాను వీడేందుకు సిద్ధమైంది. కరోనా కారణంగా తాము కుంభమేళాను ముగిస్తున్నామని, తమ రాజస్నానం పూర్తైందని అఖాడా సెక్రెటరీ పేర్కొన్నారు.













