ఆ మహత్తర ఘట్టం.. మరి కొద్దిరోజుల్లోనే
అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠకు సిద్దమయ్యింది. కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మహత్తర ఘట్టం మరి కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. శ్రీరాముని ప్రతిష్ఠాపనకు 2024 జనవరి 22వ తేదీని శుభ సమయంగా నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని, ఆ సమయంలోనే ప్రాణప్రతిష్ఠ చేయాలని నిర్ణయించినట్లు వేద పండితులు చెబుతున్నారు. దీంతో 84 సెకండ్ల పాటు ఉండే ఈ శుభ గడియల విశిష్టత ఏంటని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిష్యులు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ముహూర్తం వివరాలను వెల్లడిరచారు.













