దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి ఆయన : కిషన్ రెడ్డి
పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయవాదిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించిందన్నారు. ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి పీవీ నరసింహారావు. రాజకీయ చాణక్యుడిగా చతురతతో దేశాన్ని ముందుకు నడిపారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన చనిపోయాక ఢిల్లీలో స్మృతి వనం నిర్మిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ పని ఇప్పటికీ చేయలేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పీవీ సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించారు అని అన్నారు.













