కిరణ్ బేడికి బైబై.. తమిళిసైకి బాధ్యతలు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో అనూహ్య పరిణామాలు సంభవించాయి. మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బేడీని తొలగిచాలంటూ సీఎం నారాయణస్వామి రాష్ట్రపతిని కోరిన వారానికే ఆమెకు ఉద్వాసన పలుకటం గమనార్హం. 2016లో ఎల్జీగా నియమితులైనప్పటి నుంచి కిరణ్‌బేడీకి, ప్రభుత్వానికి మధ్య వివిధ అంశాల్లో విభేదాలు నెలకొన్నాయి.
పుదుచ్చేరిలో కాంగ్రెస సర్కారు సంక్షోభంలో చిక్కుకున్నది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేయటంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీలో 33 స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడు నామినేటెడ్ సీట్లు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 10 మంది సభ్యులు ఉండగా, ముగ్గురు డీఎంకే సభ్యులు, ఒక స్వతంత్ర సభ్యుడు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. ప్రతిపక్షానికి 14 మంది సభ్యులున్నారు.













