భారత్ నుంచి ఒక్కరికే దక్కిన గౌరవం
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో కేరళ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి గుర్తింపు దక్కించుకుంది. ఐరాస పబ్లిక్ సర్వీస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభలో ప్రసంగించాల్సిందిగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజకు ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో గొప్ప కృషి చేసిన ప్రజా ప్రతినిధుల్ని, ప్రభుత్వ అధికారుల్ని ఈ సందర్భంగా ఐరాస గౌరవించింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఒకే ఒక వ్యక్తి కేరళ ఆరోగ్య మంత్రి కె.కె.శైలజకావటం గమనార్హం.ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు ఐరాసలో ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కరోనా సంక్షోభ సమయాన వైద్య సేవలు అందిస్తూ ముందుండి పోరాడుతున్న వివిధ శాఖల్లోని సిబ్బంది విధుల్ని ఐరాస కొనియాడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఇంటికే పరిమితమైన వేళ, సామాజిక, సంక్షేమం, సరుకుల రవాణా, మొదలైన విభాగాల్లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న విధుల్ని ప్రశంసించింది. తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, ఇకముందు కూడా ఇది కొనసాగిల్సిన అవసరముందని ఐరాస అభిప్రాయపడింది. పబ్లిక్ సర్వీస్ డే కార్యక్రమలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సహా వివిధ విభాగాల అధిపతులు పాల్గొని ప్రసంగించారు.













