ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యం : కేజ్రీవాల్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎంత శక్తిమంతుడో ఆలోచించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చాలా రోజులుగా ఆయనపై కేసు నమోదు కాకపోవడంతో చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లకు కేజ్రీవాల్ సంఫీుభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించే వారంతా పార్టీలకు అతీతంగా జంతర్‌మంతర్ వద్దకు వచ్చి నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు తెలుపాలని కోరారు. రెజ్లర్లు కేవలం వారి కోసం పోరాడటం లేదని, మొత్తం క్రీడాకారుల కోసం పోరాడుతున్నారని అన్నారు. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్) ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యంచేసుకోవాల్సి వచ్చింది అని అన్నారు.













