ప్రతిపక్షాలు లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యం: కేసీఆర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. ఈ అరెస్ట్ కేవలం రాజకీయ ప్రేరేపితమని, దీన్ని తమ పార్టీ ఖండిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. నేడు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజన్నారు. ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్ర ఎమ్మెల్సీ కవిత అరెస్టులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్మెంట్లను కేంద్రం పావులుగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలను అణచివేయడానికి ఆయుధాలుగా వాడుకుంటోందని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని, ఈ విధానాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్ ఏజెన్సీల ద్వారా పెట్టి అన్ని అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన ప్రతి ఒక్కరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన అధికార నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదట 2 గంటల పాటు సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ తమకు పలు కీలక డాక్యుమెంట్లు లభించినట్లు వెల్లడించింది. అనంతరం కేజ్రీవాల్‌ను వివిధ అంశాలపై కొంతసేపు ప్రశ్నించిన సెంట్రల్ ఏజెన్సీ చివరిగా అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన ఇలాంటి సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంతో ఆప్ నేతలతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.













