లిక్కర్ స్కామ్‌లో సంచలన లేఖ విడుదల చేసిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కే. కవితను 20 రోజుల క్రితం ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆమె జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ ఆమెను తిరిగి స్పెషల్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే కోర్టు మరో 14 రోజుల పాటు ఆమెకు జ్యుడీషియల్ కస్డడీకి పంపిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె.. మంగళవారం నాడు 4 పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన కవిత.. లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని, దర్యాప్తు సంస్థల ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఈ కేసులో తాను బాధితురాలినని, రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేల్చకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయారు. విచారణ సమయంలో జడ్జి ముందు చెప్పాలనుకున్న అంశాలను పేపర్ మీద రాసుకొచ్చానని, అయితే అక్కడ అవకాశం రాకపోవడంతో ఇప్పుడు ఆ లేఖను మీడియాకు విడుదల చేస్తున్నానని చెప్పిన కవిత.. సదరు లేఖను మీడియాకు అందించారు.
ఈ లేఖలో కవిత.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, లిక్కర్ పాలసీ వల్ల తనకు ఆర్థిక పరమైన లాభం చేకూరిందనేది అసత్యమని అన్నారు. అనతరం సీబీఐ, ఈడీ విచారణ జరుగుతున్న తీరును విమర్శిస్తూ.. ‘రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదు. సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోంద’ని ఎద్దేవా చేశారు. ‘4 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యాను. విచారణకు అన్ని విధాల సహకరించాను. బ్యాంకు, బిజినెస్ వివరాలను అందించాను. దర్యాప్తు సంస్థకు నా వద్ద ఉన్న అన్ని మొబైళ్లను అందించాను. కానీ వాటిని ధ్వంసం చేశానంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. గత రెండున్నర ఏళ్లుగా సోదాలు చేశారు. మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ కేసులో చాలామందిని అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టులన్నీ వాంగ్మూలాల ఆధారంగానే జరిగాయి’ అంటూ దర్యాప్తు జరుగుతున్న తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదంతా తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రగా పేర్కొన్న ఆమె.. 95% ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టారని, తర్వాత ఆ నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న కేసుల విచారణ ఆగిపోతోందని ఆరోపించారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ పైనే ఆశలు పెట్టుకున్నాయని, తమలాంటి వారికి న్యాయస్థానం ఉపశమనం కల్పిస్తుందనే ఆశతో ఉన్నామని తన లేఖలో రాసుకొచ్చారు.













