మంత్రి పదవికి రాజీనామా చేసిన రమేశ్ జెర్కీహోళీ
ఓ యువతితో రాసలీలలు జరిపి, అడ్డంగా బుక్కైన కర్నాటక మంత్రి రమేశ్ జార్కిహోళి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ వాజుభాయ్ ఆమోదించారు. అయితే తాను మాత్రం మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. కానీ అధిష్ఠానం తెచ్చిన ఒత్తిడి వల్ల ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి యడియూరప్పకు పంపారు. సీఎం యడియూరప్ప గవర్నర్ ఆమోదం కోసం పంపారు. చివరికి గవర్నర్ రాజీనామాను ఆమోదించారు.
ఏం జరిగిందంటే…
మంత్రి రమేశ్ జర్కిహోళికి సంబంధించిన ఓ వీడియో రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఓ యువతితో ఆయన జరుపుతున్న రాసలీల వీడియో బయటికి వచ్చింది. కేపీటీసీఎల్‌లో (కర్నాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్) లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన ఓ యువతిని లొంగదీసుకున్నారు. ఆమెతో రాసలీలలు జరిపారు. అయితే ఈ వీడియోను ఎవరు తీశారన్న విషయంలో మాత్రం ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. సీఎం యడియూరప్ప కేబినెట్లో రమేశ్ జార్కిహోళి జలవనరుల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మంత్రి ఇచ్చిన హామీపై నమ్మకం లేకే… ఆ యువతే ఈ వీడియో తీయించిందని కర్నాటకలో ఓ టాక్ నడుస్తోంది. మరో రెండు రోజుల్లో కర్నాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ వేదికగా రమేశ్ వ్యవహారాన్ని ప్రస్తావించి, బీజేపీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలన్నీ నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా ఆయన అడ్డాగా పేరుగాంచిన బెళగావి లో కొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన్ను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. కర్నాటక సీఎం యడియూరప్పకు అధిష్ఠానం నుంచి ఫోన్ కూడా వచ్చినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది.
ఎవరీ రమేశ్ జర్కిహోళీ….
రమేశ్ జర్కిహోళీ యడియూరప్ప కేబినెట్లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. జలవనరుల మంత్రిత్వ శాఖను చూస్తున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో జర్కిహోళీయే ప్రధాన పాత్ర పోషించారు. కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలను డీల్ చేసి, వారితో తిరుగుబాటు బావుటా చేయించింది కూడా ఈయనే. అంతలా సీఎం యడియూరప్పకు వెన్నుదన్నుగా నిలిచారు. అంతటి వ్యక్తి ఇలాంటి వ్యవహారంలో ఇరుక్కోవడంతో బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి చేరాయి. ఒకప్పుడు ఈయన కాంగ్రెస్. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
కర్నాటకకు సెక్స్ స్కాండల్స్ కొత్త కాదు…
జల వనరుల మంత్రి రమేశ్ జర్కీహోళీ సెక్స్ రాకెట్ స్కాండల్‌లో ఇరుక్కొన్నారు. చివరికి రాజీనామా చేశారు. అయితే కర్నాటకకు ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ రాథోడ్ అడ్డంగా బుక్కయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పోర్న్ వీడియోలను చూస్తూ దొరికిపోయారు. అయితే దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తానేమీ ఆ వీడియోలను చూడడం లేదని, అనవసరమైన వీడియోలను డిలీట్ చేస్తున్నానని పేర్కొన్నారు.
2019 లో బీజేపీ ఎమ్మెల్యే అర్వింద్ లింబావలి కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కునవారే. తన రాజకీయ ప్రత్యర్థులు తన విషయంలో అశ్లీలమైన, అభ్యంతరకరమైన నకిలీ వీడియో క్లిప్‌ను వైరల్ చేస్తున్నారని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు హెచ్.వై. మేటి, బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా ఇలాంటి వ్యవహారాల్లోనే ఇరుక్కున్నారు. ఓ మహిళను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక 2012 లో కూడా అచ్చు ఇలాంటి ఘటనే జరిగింది. బీజేపీ నేతలు లక్ష్మణ్ సావది, కృష్ణ పాలేమార్, సీసీ పాటిల్ అసెంబ్లీ పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయారు. అప్పట్లో వారందరూ మంత్రులే. ఇలా కర్నాటకలో ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు.













