కష్టపడినా ఫలితం దక్కలేదు.. కర్ణాటక ఫలితాలపై స్పందించిన బొమ్మై..
కర్ణాటక ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు ఎంతగానో శ్రమించారని, అయినా కూడా ఫలితం దక్కలేదని కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల సరళిపై బొమ్మై స్పందించారు. మెజారిటీ మార్కు చేరుకోవడంలో తమ పార్టీ విఫలమైందని అన్నారు. పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి ఈ ఫలితాల్లో దూసుకుపోతున్న క్రమంలో బొమ్మై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ వర్కర్లు, నేతలు.. అందరూ శాయశక్తులా పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని బొమ్మై చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రభావం తాము అనుకున్న ప్రభావం చూపలేకపోయామని చెప్పారు. ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత పార్టీలో అంతర్మథనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని, జరిగిన పొరపాట్లను దిద్దుకుంటామని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపడతామని స్పష్టం చేశారు.













