లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో బీజేపీకి షాక్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. నెల రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తేజస్విని గౌడ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, మీడియా, ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీపై, కేంద్ర నాయకత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు తిరిగి రావడం తన సొంతింటికి తిరిగి వచ్చినట్లుగా ఉందని చెప్పిన తేజస్విని గౌడ.. కాంగ్రెస్ పార్టీ మాటల్లో కాకుండా చేతలను నమ్ముతుందని అన్నారు. చరిత్ర ఉన్న కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందని, ఇకపై పార్టీ కోసం పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తానని స్పష్టం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో 23 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే మాజీ జర్నలిస్ట్ అయిన తేజస్విని గౌడ.. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. బెంగళూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడనే ఓడించారు. అయితే ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. కమలం పార్టీ తరపునే 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తేజస్విని గౌడ.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఇక ఈ ఏడాది జూన్‌తో ఆమె ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగియనుండగా గత నెలలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు నేరుగా సొంతగూటికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే తేజస్విని గౌడ రాకను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్‌తో పాటు ఇతర నేతలు స్వాగతించారు.













