ఉద్ధవ్ పై ఖంగుమన్న కంగనా.. కయ్యాలకు కాలు దువ్వుతోందా?
బాలీవుడ్ కాంట్రావర్షీ క్వీన్ కంగనా రనౌత్ మళ్లీ తన గొంతును ఖంగుమనిపించింది. యువ హీరో సుశాంత్ అనుమానాస్పద మరణం తర్వాత రకరకాల అంశాల ద్వారా వార్తల్లో ఉంటూ తన మాటల తూటాలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంగన.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది. మొత్తానికి కంగన కాస్త మెత్తబడిందేమో అనే సందేహాలు ఊపిరిపోసుకునేంతలోనే మళ్లీ ఖంగుమంటూ తన గొంతును వినిపించింది. దీనికి మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ దాఖరే చేసిన వ్యాఖ్యలే కారణం.
ముంబైలో బ్రతుకు తెరవు కోసం కొందరు వచ్చిన వారు ఇప్పుడు ముంబయిపైనే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఉద్ధవ్ మండిపడిన సంగతి తెలిసిందే. బతుకు తెరవు కోసం వచ్చిన వాళ్లు ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడం ఏమిటంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి వాళ్లు ముంబయి పరువు తీస్తున్నారంటూ ఆయన విమర్శించారు.
తాజాగా తనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరే చేసిన వ్యాఖ్యలకు కంగన తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వారసత్వం ద్వారా వచ్చిన ఓ చెత్త ఉత్పత్తి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిఎం ఉద్ధవ్ తనను నమ్మక ద్రోహి అని ముంబై తనకు షెల్టర్ ఇవ్వకపోతే తనకు తిండి కూడా దొరకదన్నారంటూ మండిపడింది. తాను సొంత టాలెంట్‌తో ఎదిగిన ఒంటరి మహిళనని, కొడువుకు వయసున్న తన గురించి ఉద్ధవ్ థాకరే మాట్లాడిన తీరు చూస్తోంటే సిగ్గేస్తోందంది. ఉద్ధవ్ థాకరేలా తాను తండ్రి అధికారం, డబ్బును అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదంటూ తిట్టిపోసింది. తాను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్నని కాని టాలెంట్‌ను నమ్ముకున్నాను కాబట్టే బయటకు వచ్చానంది. అయితే, తాను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చానని, కానీ, తాను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదని చెప్పింది. తనలాంటి వారికి కొంతమందికి ఆత్మగౌరవం ఉంటుందంటూ ఎద్దేవా చేసింది.
కేవలం పరోక్ష వ్యాఖ్యలు చేసినందుకే ఉద్ధవ్‌పై కంగన నేరుగా ప్రతిస్పందించడం అది కూడా ఎడా పెడా తిట్టిపోయడం చూస్తుంటే కంగనా రనౌత్ ఎట్టి పరిస్థితుల్లోనూ కయ్యానికి సై అనేలా ఉన్నారనేది తేటతెల్లమవుతోంది. కొన్ని రోజుల మౌనం కూడా ఆమె నెవరూ ఏమీ అనకపోవడం వల్లే తప్ప ఆమె మారడం వల్ల కాదనేది కూడా స్పష్టమైంది. వార్తల్లో ఉండడమే అజెండాగా దూసుకుపోతున్న ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రానున్న రోజుల్లో మరింత మందిపై తన వాగ్భాణాలు సంధిస్తారనేది నిస్సందేహం.













