ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. కస్టడీ పొడిగించిన కోర్టు

ఢిల్లీ మద్యం పాలసీ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సోమవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఆమె కస్టడీని జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ కవితపై సీబీఐ, ఈడీ వరుస కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను మార్చి 26వ తేదీన అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. కొన్నాళ్లు సీబీఐ కస్టడీలో, కొన్నాళ్లు ఈడీ కస్టడీలో ఉండగా.. ఆ తర్వాత కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.