భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్
భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ (యు.యు.లలిత్) నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్.ఎన్.వి.రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనుండటంతో తన స్థానంలో జస్టిస్ యు.యు.లలిత్ పేరును ఆయన సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీంతో యు.యు.లలిత్‌ను భారత 49వ సీజేఐగా నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకం చేశారు. అయితే ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆగస్టు 27న యు.యు. లలిత్ నూతన సీజేగా బాధ్యలు చేపట్టనున్నట్టు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఆయన కేవలం మూడు నెలలకన్నా తక్కువ సమయమే సీజేగా కొనసాగనున్నారు. నవంబర్ 8తో జస్టిస్ యు.యు.లలిత్‌కు 65 ఏళ్లు పూర్తి కానుండటమే అందుకు కారణం.
1957 నవంబర్ 9న జన్మించిన లలిత్ జూన్ 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1985 డిసెంబర్ వరకు బాంబే హైకోర్టులో పని చేశారు. ఆపై ఢిల్లీలో సేవలు అందిస్తూ 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా బార్ ఆయనను సిఫార్సు చేయకముందు సీబీఐ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు.













