సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా.. జస్టిస్ భూయాన్, జస్టిస్ భట్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కేరళ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఈ నెల 5వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్ువాల్ తెలిపారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనుంది. ఇంకా రెండు పోస్టులు ఖాళీగా ఉంటాయి. జస్టిస్ భూయాన్ 2029 ఆగస్టు 1 వరకు, జస్టిస్ భట్ 2027 మే 5 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగనున్నారు.













