భారత్, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం
దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాల రక్షణలో భారత్‌కు తోడుగా నిలుస్తామని అమెరికా సృష్టం చేసింది. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామని పేర్కొంది. రెండు దేశాల మధ్య కీలకమైన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి. భారత్, అమెరికాల మధ్య ఇవి మూడో విడత 2+2 చర్చలు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్సర్, భారత్ తరపున విదేశాంగ, రక్షణ మంత్రులు జైశంకర్, రాజ్ నాథ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌లో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో, పలు ఇతర ప్రాంతాల్లో చైనా దూకుడును ఎదుర్కొనే విషయమై చర్చించారు. చర్చల అనంతరం నలుగురు మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణల్లో భారత జవాన్లు మృతి చెందిన విషయాన్ని పాంపియో ప్రస్తావించారు. అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) నుంచి ఎదురయ్యే సవాళ్లతో పాటు అన్ని ఇతర ప్రమాదాలను కలసికట్టుగా ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించుకునే దిశగా ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సీసీపీ ప్రజాస్వామ్యానికి, పారదర్శక న్యాయపాలనకు వ్యతిరేకమన్న విషయంలో మనందరికీ సృష్టత ఉంది. సీసీపీ నుంచే కాకుండా, అన్ని వైపుల నుంచి వచ్చే ముప్పులను భారత్, అమెరికా ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి అని అన్నారు.
ఈ 2+2 చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య మొత్తం ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో కీలకమైన బేసిక్ ఎక్స్చేంజ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బీఈసీఏ-బెకా) ఉంది. చర్చల్లో చైనా విస్తరణవాదం పైననే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే అన్ని రక్షణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటామనే సృష్టమైన సందేశాన్ని ఈ చర్చల సందర్భంగా వెలువరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సెక్యూరిటీ పరిస్థితిని సమీక్షించామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు కట్టుబడి ఉన్నామని సింగ్ పునరుద్ఘాటించారు. చర్చల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంపై ప్రధానంగా చర్చ జరిగిందని జైశంకర్ వెల్లడించారు.
చైనా ఆధిపత్యం భారత్‌కు ఆమోదనీయం కాదన్న విషయాన్ని సృష్టం చేస్తూ బహుళ ధృవ ప్రపంచానికి భూమికగా బహుళ ధృవ ఆసియానే ఉండాలి అని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలోని అన్ని దేశాల్లో శాంతి, సుస్థిరత నెలకొనడం, అన్ని దేశాలు అభివృద్ధి చెందడం కీలకం. అందుకు అంతర్జాతీయ నిబంధనల అమలు, అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం అత్యంత ఆవశ్యకం అని జైశంకర్ తెలిపారు. చైనా విస్తరణవాద దుందు చర్యల నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ వాదనకు యూఎస్ మద్దతునిస్తుందని ఎస్పర్ అన్నారు. భారత్ పొరుగు దేశాల్లోని పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయన్నారు.













