మమత లేని కూటమిని కాంగ్రెస్ ఊహించలేదు: జైరాం రమేశ్
తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లేని ఇండియా (I.N.D.I.A.) కూటమిని తాము ఊహించలేమని జైరాం రమేశ్ అన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మమత.. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బెంగాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో తాము సంప్రదింపులు జరిపామని, కానీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదని ఆమె తెలిపారు. అందుకే రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో తాము ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు మమత వెల్లడించారు. ఇలాంటి సమయంలో జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాగా, రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర.. గురువారం నాడు బెంగాల్లోకి ప్రవేశించనుంది. అయితే ఈ విషయంలో తమకు కనీసం సమాచారం అందలేదని మమతా బెనర్జీ వాపోయారు. ఈ అంశంపై కూడా జైరాం రమేశ్ స్పందించారు. ఇండియా (I.N.D.I.A.) కూటమికి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ చాలా కీలకమైన మూలస్తంభాలని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేమన్నారు. మరి దీనిపై మమత ఎలా స్పందిస్తారో చూడాలి.













