గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో హై అలర్ట్
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతితో ఉత్తరప్రదేశ్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు ప్రకటించిన పోలీసులు.. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎవ్వరూ తప్పుడు ప్రచారాలు చేయరాదని, అలా చేసేవారిని అరికట్టేందుకు ఐటీ సెల్ గట్టి నిఘా పెట్టిందని వెల్లడించారు. సుమారు 25కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ.. దాదాపు 2 దశాబ్దాలుగా యూపీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం ముఖ్తార్ అన్సారీ మరణించారు. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ గురువారం రాత్రే ప్రకటించారు. అయితే ముఖ్తార్ కుమారుడు ఉమర్ అన్సారీ మాత్రం తన తండ్రికి ‘స్లో పాయిజన్’ ఇచ్చారని ఆరోపిస్తుండడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఉమర్..‘‘2 రోజుల క్రితం నా తండ్రిని కలవడానికి వచ్చాను. కానీ అధికారులు అనుమతించలేదు. ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయనను ఆరోగ్యం కుదుటపడకుండానే తిరిగి జైలుకు తరలించారు. వైరలైన ఓ వీడియోలో ఆయన పొట్ట ఉబ్బినట్లు ఉండడం అందరూ గమనించొచ్చు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించింది. దీంతో హుటాహుటిన తీసుకొచ్చి ఐసీయూలో చేర్చారు. కానీ, 12 గంటల తర్వాత తిరిగి ఎందుకు తీసుకెళ్లిపోయారో అర్థం కావడం లేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం’’ అని అన్నారు.
కాగా.. ముఖ్తార్ మృతిపై ఆయన సోదరుడు, గాజీపుర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తన సోదరుడి మరణం అనుమానాస్పదంగా ఉందని, ఆయనను మరణం అనారోగ్యంతో సంభవించినట్లు లేదని అన్నారు. కానీ పోలీసులు మాత్రం వీరి ఆరోపణలను ఖండించారు. ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్ను బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య గురువారం రాత్రి 8.25కు ఆసుపత్రికి తీసుకువచ్చామన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కొద్ది సేపట్లోనే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు.













