ఒక్కటి కాదు… దేశానికి నాలుగు రాజధానులుండాలి
దేశానికి నాలుగు రాజధానులు ఉంటే బెటర్ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రొటేషన్ పద్ధతిలో భారత్కు నాలుగు రాజధానులు ఉంటే మంచిదని నమ్ముతున్నట్లు దీదీ తెలిపారు. బ్రిటీషర్లు యావత్ దేశాన్ని కేవలం కోల్కతా నుంచే పాలించారని, దేశంలో ఒకే ఒక్క రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు. దేశనాయక్ దివస్ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. నేతాజీని దేశనాయక్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ పిలిచేవారని, కానీ పరాక్రమ్ దివస్ అని బీజేపీ నాటకాలు చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు.
ఆజాద్ హింద్ స్తూపాన్ని నిర్మిస్తామని, అది ఎలా పూర్తి అవుతుందో చేసి చూపిద్దామని ఆమె అన్నారు. కేంద్ర పాలకులు వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు, స్థూపాలు నిర్మించారని, కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారని దీదీ ఆరోపించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసే సమయంలో నేతాజీ.. ప్రతి భారతీయుడిని దాంట్లో చేర్చుకున్నారని, గుజరాతీ, బెంగాళీ, తమిళ వారిని ఆయన చేర్చుకున్నట్లు మమతా బెనర్జీ గుర్తు చేశారు. బ్రిటీషర్ల విభజించు, పాలించు విధానాన్ని నేతాజీ అడ్డుకున్నట్లు దీదీ తెలిపారు. గతంలో ఎప్పూడూ నేతాజీ దివస్ను కేంద్రం నిర్వహించలేదని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు.













