59 చైనా యాప్‌లపై భారత్ నిషేధం
చైనా కంపెనీలతో సంబంధమున్న యాప్‌లపై కేంద్రం కొరడా ఝులిపించింది. టిక్‌టాక్, హెలో, స్వీట్ సెల్ఫీ, షేర్ ఇట్, లైకీ, బ్యూటీ ప్లస్, విగో వీడియో, క్యూక్యూ ప్లేయర్, యుసి బ్రౌజర్ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలతో వీటికి ప్రమేయమున్నట్లుగా సమాచారమున్నదని కేంద్ర సమచార సాంకేతికశాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. దేశ రక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం సృష్టం చేసింది. డేటా భద్రత, ప్రైవసీ (గోప్యత)కి సంబంధించిన ఈ యాప్ప్సై పలువురి నుంచి ఆందోళన వ్యక్తమైందని, ఫిర్యాదులందాయని తెలిపింది.
ఈ నెల 15న గల్వాన్ సరిహద్దున ఇరు దేశాల సైన్యాల ఘర్షణలో 21 మంది భారత జవాన్లు మృతి చెందిన ఘటనతో చైనా పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలన్న డిమాండ్లకు బలం చేకూరుతోంది. దాంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. అయితే చైనీస్ యాప్‌ల వల్ల వినియోగాదారుల సమాచారానికి భద్రత లేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.














