స్వాతంత్య్ర సమరయోధుడిలానే.. నేనూ జైలు పాలయ్యా: సిసోడియా
లిక్కర్ స్కాంలో ఏడాది క్రితం అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా తన నియోజకవర్గమైన పట్పర్గంజ్ ప్రజలకు జైలు నుంచే శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తానూ త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని ఆయనన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. తన లేఖలో బీజేపీ సర్కార్ను బ్రిటీష్ పాలకులతో పోల్చిన సిసోడియా.. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్రం కోసం పోరాడి జైలు పాలైన వారిలానే తాను కూడా జైలుపాలయ్యానన్నారు. ఏడాది కాలంగా ప్రజలను కలుసుకోలేకపోయాయని, త్వరలోనే బయటకొచ్చి అందరినీ కలుస్తానని రాసుకొచ్చారు.
‘గతంలో బ్రిటిష్ వాళ్లు కూడా అధికార దురహంకారంతో స్వాతంత్య్ర సమర యోధులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేవారు. ఢిల్లీలో నాణ్యమైన విద్య, పాఠశాలల కోసం పోరాడడం స్వాతంత్య్ర పోరాటంతో సమానమే. నియంతృత్వ బ్రిటిష్ పాలన సమయంలోనే ప్రజలు పోరాడి స్వాతంత్య్రం అనే కలను సాకారం చేసుకున్నారు. అలాగే ఢిల్లీలోని పిల్లలందరూ నాణ్యమైన విద్యను అభ్యసించే రోజు కూడా వస్తుంది’ అంటూ సిసోడియా తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన సిసోడియా.. 13 నెలలుగా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో శనివారం ఆయన బెయిల్పై విచారణ జరగ్గా.. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.













