ఈ భూమ్మీద తన కంటే అదృష్టవంతులు.. ఎవరూలేరు
ఈ భూమ్మీద తన కంటే అదృష్టవంతులు ఎవరూలేరు రామ్‌లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ అమితానందం వ్యక్తం చేశారు. ఈ మైసూరు శిల్పి తయారు చేసిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేయగా, అది ఈ రోజు ఆలయంలో కొలువుతీరింది. ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే అనే భావన కలుగుతోంది. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్‌లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తుంది అని మీడియా ఎదుట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో ఒక్క విగ్రహాన్ని గర్భగుడికోసం ఎంపిక చేశారు. అది యోగిరాజ్ చెక్కినది. మిగిలినవాటిని కూడా ఆలయంలోనే ఇతర ప్రాంతాల్లో ఉంచుతారు. రామ్‌లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడి విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ( దాదాపు 4.2 అడుగులు) ఆకర్షనీయమైన కృష్ణ శిలతో తీర్చిదిద్దారు. శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. ఈ రోజు ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింంది.













