పాస్ పోర్టు కావాలంటే..నెలకు పైగానే
పాస్పోర్టు కావాలంటే వస్తున్న దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కరోనా ఆంక్షలతో గతంలో తాలూకు దరఖాస్తులు కూడా కొంత అపరిష్కృతంగా ఉన్నాయి. దీనితో వేచి చూడవలసిన సమయం పెరిగిపోయింది. గతంలో అయితే పాస్పోర్టు వారం, పది రోజుల్లోనే వచ్చేసేది. స్లాట్ బుక్ చేసుకుని, తదుపరి రెండు రోజుల్లోనే పాస్పోర్ట్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవలసి ఉండేది. పోలీసులు విచారణ పూర్తి చేసిన తరువాత పాస్పోర్ట్ జారీ అయ్యేది. కానీ ఇప్పుడు పాస్పోర్టు కోసం స్లాట్ కావాలంటే నెలన్నర పాటు వేచి చూడవలసి వస్తోంది. దీనికి తోడు అధిక దరఖాస్తులు ఉన్నందున విచారణకు కూడా కొంత అధిక సమయం తీసుకోంటోంది. వెరసి 45 రోజులకు పైనే వేచి చూడవలసిన పరిస్థితి నెలకొంది. విదేశాలకు ఉన్నత విద్య, ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా పది వేల మందికి పైనే పాస్పోర్ట్ స్టాట్ల కోసం పాస్పోర్ట్ సేవా వెబ్సైట్ను సందర్శిస్తున్నారు. కానీ వాస్తవ సామర్థ్యం ఐదు వేలే. దీనితో రెట్టింపు సమయం పడుతోంది.













