ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించుకోలేదు : హోం మంత్రి అమిత్ షా
బీజేపీ హయాంలో భారత భూభాగాలను చైనా ఆక్రమించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఒక్క అంగుళం భారత భూభాగాన్ని కూడా చైనా ఆక్రమించలేదని అన్నారు. అస్సాంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి.. లఖంపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లను వదులుకోవడానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సిద్ధమయ్యారని ఆరోపించారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డోక్లామ్లో కూడా చైనా సైనికులను తరిమికొట్టాం. గతంలో కాంగ్రెస్ పాలకులు అస్సాంకు అన్యాయం చేశారు. వివిధ హింసాత్మక ఆందోళనలు, తిరుగుబాటు సంబంధిత ఘటనల్లో అనేకమంది మృతి చెందారు. కానీ.. గత పదేళ్లలో శాంతి ఒప్పందాలు కుదిరాయి. తొమ్మిది వేల మంది ఆందోళనకారులు లొంగిపోయారు. రాష్ట్రంలోని 80 శాతం ప్రాంతాల నుంచి సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకున్నాం. బంగ్లాదేశ్తో దేశ సరిహద్దును కట్టుదిట్టం చేసి చొరబాట్లను అరికట్టాం’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు మరికొంతమంది మంత్రులు, నేతలు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాను ఉద్దేశించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.













