తాము అధికారంలోకి వస్తే… మధ్యప్రదేశ్ ప్రజలకు ఉచితంగా
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విదిశలోని సిరోంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధప్రదేశ్ రాష్ట్ర వాసులకు ఓ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ ప్రజలను యూపీలోని అయోధ్య దర్శనానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదే పదే అడిగేవారు. ఆయనకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరగుతుంది అని తెలిపారు. వెంటనే అక్కడున్న ఓ సీనియర్ బీజేపీ నేత స్పందిస్తూ అయోధ్య మందిర దర్శనం కోసం తాము డబ్బులు ఖర్చు చేయాలా? అని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ మీరు ఎలాంటి ఖర్చూ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తాం. దశల వారీగా మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తాం. మా ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని ప్రకటించాం అని వెల్లడించారు.













