హిమాచల్ లో మళ్లీ కమలానికే పట్టం.. ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పాయంటే?
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. ఇక్కడ కాషాయ పార్టీకి 41 సీట్లు వస్తాయని ఈ పోల్స్ లో తేలింది. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 25 సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది. ఇండియా టీవీ -మాట్రిజ్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో ఈ ఫలితాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 68 స్థానాల్లో నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడి అవుతాయి. ఈ పోల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి 46 శాతం ఓట్లు వస్తాయట. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓట్లు దక్కుతాయని ఈ ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. పంజాబ్ లో అద్భుత విజయం సాధించి, హిమాచల్ ప్రదేశ్ లో కూడా సత్తా చాటాలని అనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు 2 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయట. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 శాతం ఓట్లు దక్కుతాయి. అలాగే ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 68 సీట్లలో బీజేపీ 41, కాంగ్రెస్ 25 సీట్లలో గెలుస్తాయి. ఆప్ కనీసం ఖాతా కూడా తెరవదు. ఇతరులు 2 సీట్లలో గెలుస్తారు.













