సీఎం కూడా ఓడిపోతాడు.. హిమాచల్ మాదే: కాంగ్రెస్ ధీమా!
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. తాము ఈ ఎన్నికల్లో సమిష్టి నాయకత్వంతో ముందుకు సాగుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. దివంగత నేత వీరభద్ర సింగ్ ను గుర్తు చేసుకున్న సూర్జేవాలా.. ప్రస్తుతం కొత్త తరం యువనేతలతో పార్టీ నూతనోత్తేజంతో ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ గతేడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన సూర్జేవాలా.. ”పార్టీలో ఇప్పటికే కొత్తతరం నేతలు తమను తాము నిరూపించుకుంటున్నారు. వీరిలో ఎవరైనా సరే పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరు. ఆ సత్తా వాళ్లకు ఉంది” అని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో తమ పార్టీ మూడింట రెండు వంతుల సీట్లు గెలుచుకుంటుందని, ఆ దిశగా తాము దూసుకుపోతున్నామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సీఎం జైరామ్ ఠాకూర్ సొంత సీటు కూడా కాపాడుకోలేరని జోస్యం చెప్పారు.













