ఏడాదిలోగా టోల్‌ప్లాజాలన్నీ ఎత్తేస్తాం : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
టోల్‌ప్లాజాల విషయంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా ఎత్తేస్తామని ప్రకటించారు. వీటి స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఒకే ఒక సంవత్సరంలో దేశంలోని టోల్ప్లాజాలన్నింటినీ తొలగిస్తా. ఈ మేరకు హామీ ఇస్తున్నా. జీపీఎస్ ఆధారంగా ఇకపై టోల్ వసూళ్లు చేస్తాం. జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నాం.’’ అని లోక్‌సభలో నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పటికే 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నాయని, మిగిలిన ఏడు శాతం వాహనాలు డబుల్ టోల్‌ను చెల్లిస్తున్నా, ఫాస్టాగ్‌ను తీసుకోలేదన్నారు. టోల్ చెల్లించేందుకు గాను ఫాస్టాగ్‌ను ఉపయోగించని వాహనాలపై దర్యాప్తు జరపాలని తాము పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదంలో మరణించిన వారే అధికం…
కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య అధికంగా ఉందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య అధికంగానే ఉందని, ఈ విషయంలో కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోందని తెలిపారు. వాటిని అరికట్టడానికి శతధా ప్రయత్నిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా 1.46 లక్షల మంది మరణిస్తే, రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మరణించారని గడ్కరీ వెల్లడించారు.













