జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆయన్ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైలులో ఉన్న ఆయన జూన్ 28న విడుదలైన నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు రాంచీలో ప్రస్తుత సీఎం చంపాయీ సోరెన్ నివాసంలో భేటీ అయ్యారు. మళ్లీ హేమంత్ సీఎంగా ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి గులాం అహ్మద్ మీర్, ఆ పార్టీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆయన సోదరుడు బసంత్ కూడా ఉన్నారు.