కర్ణాటక ఫలితాలపై కుమారస్వామి రియాక్షన్ ఇదే..!
కర్ణాటక ఎన్నికల్లో ఒక 40-50 స్థానాలు గెలిచి.. గతంలో వలె ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని అనుకున్న కుమారస్వామికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కడంతో జేడీఎస్ అవసరం ఆ పార్టీకి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై కుమారస్వామి స్పందించారు. కర్ణాటక ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నట్లు చెప్పిన ఆయన.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయం అని తెలిపారు. గెలుపు, ఓటమిని తాము సమానంగా స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ ఓటమే తమకు ఫైనల్ కాదని, తాము ఎప్పుడూ ప్రజలతోనే ఉంటామని స్పష్టం చేశారు. ఓటమి తనకు కానీ, తన కుటుంబానికి కానీ కొత్త కాదని కుమారస్వామి అన్నారు. గతంలో తాను, తన తండ్రి దేవెగౌడ, తన సోదరుడు రేవణ్ణ కూడా ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని, అధికారంలోకి వస్తున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తున్నానని అన్నారు. నూతన ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.













