ఆప్ కీలక నిర్ణయం .. రాజ్యసభకు హర్భజన్ సింగ్
పంజాబ్‌లో నూతనంగా కొలువుదీరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను తమ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీలోని ఆప్ వర్గాల సమాచారం. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఆప్‌కు కొత్తగా రెండు రాజ్యసభ బెర్తులు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భజ్జీని పెద్దల సభకు పంపాలని పార్టీ కేంద్ర కార్యవర్గం కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే నిమిత్తం భజ్జీకి మరో కీలక బాధ్యత కూడా అప్పజెప్పాలని ఆప్ యోచిస్తోంది. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే జలంధర్ స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది.













