దీనిపై ప్రధాని, ఈడీ బదులిచ్చి తీరాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ, ఈడీలు బదులివ్వాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయం తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని ఆయన తెలిపారు. పాపపు సొమ్ముతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చారని, అదే పాపపు సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోశారని, ఇప్పుడు తెలంగాణలో వారి ప్రయత్నం బెడిసికొట్టిందని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అక్రమార్జనతో కుప్పకూల్చటం అసాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ కుట్రపై ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని, ఈడీ బదులిచ్చి తీరాలని, తప్పించుకోవటం కుదరదని పేర్కొన్నారు. బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. తప్పు దారిలో పయనిస్తున్న బీజేపీ ఎప్పటికైనా ఎదరుదెబ తప్పదని హెచ్చరించారు.













