ఊరటనిచ్చిన కేంద్రం… కరోనా మందులు, పరికరాలపై పన్ను ఊరట

ఆర్థికంగా సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై పన్నులు తొలగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి భేటీ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. కొత్త పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబర్ మాసాంతం వరకూ అందుబాటులో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్లపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ కొనసాగుతోంది. ఈ 5 శాతం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీని సైతం కేంద్రమే భరిస్తుందని సీతారామన్ పేర్కొన్నారు. దీంతో వచ్చే ఆదాయంలో 70 శాతం వాటాను తిరిగి రాష్ట్రాలకే పంచుతామని ప్రకటించారు. ఇక అంబులెన్స్‌లపై విధించే జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఇది 28 శాతంగా ఉంది. ఇక వెంటిలేటర్‌పై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే వ్యాక్సిన్ల విషయంలో జీఎస్టీ యథాతథంగా ఉంచడంపై అందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.