జల్లికట్టు కు గ్రీన్ సిగ్నల్ …
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడకు అనుమతినిచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ పోటీల్లో 300 మంది మాత్రమే పాల్గొనేలా పరిమితిని విధించింది. మామూలుగా అయితే వేల సంఖ్యలో యువకులు ఈ పోటీలో పాల్గొని ఎద్దులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొవిడ్ కారణంగా పరిమితులతో కూడిన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
జల్లికట్టు, మంజువిరట్టు (ఎద్దులతో పాల్గొనే మరోరకమైన క్రీడ)లో 300 మంది, ఎరుతువారట్టులో 150 మంది మాత్రమే పాల్గొనేలా అనుమతించాం. అలాగే ఈ పోటీలన్నీ బహిరంగ మైదానాల్లోనే నిర్వహించాలి. మొత్తం మైదానం సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరవ్వాలి అని ఆ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించించింది. అలాగే వాటిని వీక్షించడానికి వచ్చే ప్రజలకు ధర్మల్ స్కానర్తో తనిఖీలు చేయాలని తెలిపింది. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించింది. ఈ పోటీల్లో పాల్గొనే వారు తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. నెగిటివ్ అని తేలిన వారికే అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది.













