2 లక్షలమందికిపైగా వీక్షించిన శ్రీ సాయి గ్లోబల్ హారతి 2020 విజయవంతం
శ్రీ సాయిబాబావారి దివ్యాశీస్సులతో షిర్డీసాయి సంస్థాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో, సాయిలీల హిందీ, తెలుగు టి.వి.ల ద్వారా ఫేస్ బుక్ ద్వారా, వెబ్ సైట్ ద్వారా డిసెంబర్ 10వ తేదీన నిర్వహించిన హారతి సాయిబాబా- లక్షగళ మహా శేజ హారతిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు పాల్గొని చరిత్ర సృష్టించారని శ్రీ సాయి గ్లోబల్ హారతి కన్వీనర్ సాయి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమము అనుకున్నదానికన్నా బాగా సక్సెస్ అయిందని చెబుతూ, ఈ మహాయజ్ఞం ఇంత జయప్రదం కావడానికి శ్రీ సాయినాధుని అపారమైన కృపయే కారణమన్నారు. ఈ మహా శేజ హారతి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సాయి హారతి ప్రత్యేకత తెలుసుకునేలా చేయడంతోపాటు కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాల్సిందిగా సాయినాధుని భక్తులు వేడుకున్నారని చెప్పారు.
ఈ అపూర్వ విజయం వెనుక మీ అందరి కృషి ఉందని, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా సాయి గ్లోబల్ హారతి టీమ్‌కు ధన్యవాదాలు చెబుతూ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సాయి లీల హిందీ, తెలుగు యూట్యూబ్ ఛానెల్లో, సాయి గ్లోబల్ హారతి వెబ్ సైట్ లో మా మూడు ఫేస్ బుక్ ల దాదాపు 2 లక్షలమందికిపైగా వీక్షించారని తెలిపారు. ఇంకా సమాచారం రావాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన షిర్డీ సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి, ఇతరులకు సాయి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు.













