2021 నుంచి చిప్ ఆధారిత పాస్‌పోర్టులు
నకిలీవి తయారు చేయడానికి వీల్లేని రీతిలో ఎలక్ట్రానిక్ మైక్రో ప్రాసెసర్ చిప్‌తో రూపొందించిన ఇ-పాస్‌పోర్టులనే 2021 నుంచి జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులకు సత్వరం ఇమ్మిగ్రేషన్ పక్రియ పూర్తయ్యేందుకు ఈ పద్ధతి ఉపయోగపడనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 20 వేల మంది దౌత్యాధికారులు, ఇతర అధికారులకు వీటిని జారీచేశారు. అది విజయవంతం కావడంతో ఇప్పుడు వీటిని కోరుకున్నవారందరికీ అందజేయనున్నారు. ఇప్పటివరకు పాస్‌పోర్టులను చిన్న పుస్తక రూపంలో ముద్రించి ఇస్తున్నారు. ఈ- పాస్‌పోర్టులు మాత్రం అలా కాకుండా అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) ప్రమాణాలకు లోబడి అధునాతనంగా ఉంటాయి. దీనివల్ల ప్రయాణికులు ఎక్కడైనా దీనిని సులభంగా వాడుకోవచ్చు. ప్రస్తుత పక్రియకు ఎలాంటి అవాంతరం లేకుండా ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థను దశలవారీగా విస్తరిస్తారు.
పాస్‌పోర్టు జారీకి ఇప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఇకపైనా ఇంచుమించు అంతే వ్యవధి పడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసిన తర్వాత దేశంలోని 36 పాస్‌పోర్టు కార్యాలయాలూ వీటి జారీని దశలవారీగా ప్రారంభిస్తాయి. వ్యక్తిగత ఈ- పాస్‌పోర్టుల జారీకి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని నెలకొల్పుతున్నాం. 2021 నుంచి రోజుకు 50,000 పాస్‌పోర్టులు జారీ చేయాలనేది లక్ష్యం. దీని కోసం ఢిల్లీ, చెన్నైల్లో డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రెండు నగరాల్లో ఐ.టి. వ్యవస్థను నెలకొల్పే సమర్థత ఉన్న సంస్థకు ఖరారు చేయాల్సి ఉంది అని ఎంఈఏ అధికారి ఒకరు తెలిపారు.













