గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్…
గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా పలు ఫీచర్లు వచ్చి చేరాయి. అందులో ముఖ్యంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ గురించి చెప్పుకోవాలి. దీని వల్ల వ్యక్తులు తమ ఫోన్లో గూగుల్ మ్యాప్ యాప్ తెరిచి, ల్యాండ్‌మార్క్‌ను కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ గుర్తించవచ్చు. ఏ ప్రదేశం లేదా రెస్టారెంట్ అయినా వర్చువల్‌గా చూడవచ్చు. జెనెసిస్ ఇంటర్నేషనల్ టెక్ మహీంద్ర కంపెనీల భాగస్వామ్యంతో గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది. అయితే ముందుగా బెంగళూరు వాసులకు ప్రయోగాత్మకంగా స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే హైదరాబాద్ వాసులకు, ఆ తరువాత కోల్‌కతా, మిగిలిన పట్టణాలకు ఈ సదుపాయం విస్తరించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
స్ట్రీట్ వ్యూ కోసం యూజర్లు గూగుల్ మ్యాప్స్ యాప్‌ను తెరవాలి. తమకు కావలసిన రోడ్ లేదా ఏరియాను జూమ్ చేయాలి. అక్కడ స్థానికంగా ఉన్న కేఫ్‌లు, సాంస్కృతిక కేంద్రాలు, ఇతర వాణిజ్య కేంద్రాలు, వీధులు, ఇళ్ల గురించి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఫలానా ప్రాంతం, ఫలానా వీధిలో ఏమేవి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫలానా రహదారిపై వాహనాల వేగం పరిమితులు ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది. మూసివేసిన రోడ్ల వివరాలు, ఇతర అవరోధాలను సైతం గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకునే ఏర్పాటును గూగుల్ కల్పించింది.













