ఆజాద్ కొత్త పార్టీ ప్రకటన మరో రెండ్రోజుల్లో!
కాంగ్రెస్‌లో సుమారు యాభై ఏళ్ల అనుబంధానికి ఇటీవలే స్వస్తి చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త పార్టీ పెడతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ పార్టీ వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తారని సమాచారం. ఆదివారం నాడు జమ్మూ చేరుకున్న ఆజాద్.. తన ఇంట్లోనే మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ప్రారంభించే ముందు మీడియాను ఆహ్వానిస్తున్నా. కార్యకర్తలు, నేతలతో మాట్లాడేందుకే ఇక్కడకు వచ్చాను’ అని ఆజాద్ తెలిపారు. ఈ క్రమంలో ఆజాద్ కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని ఆయన సన్నిహితుడు ఒకరు ధ్రువీకరించారు. కార్యకర్తలు, నేతలతో ఆజాద్ వరుస సమావేశాలు జరుపుతున్నారని, 27న శ్రీనగర్ వెళ్తారని సదరు వ్యక్తి చెప్పారు. పార్టీ జెండా, పేరు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయని, మరో ఒకటి రెండు రోజుల్లో జమ్మూకశ్మీర్‌లో కొత్త పార్టీ ఆవిర్భావం జరుగుతుందని అన్నారు. 73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పార్టీ సంప్రదింపుల విధానాన్ని రాహుల్ గాంధీ ధ్వంసం చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఆజాద్‌కు మద్దతు తెలిపిన జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్, మరో 12 మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీని వీడారు.













