ఆజాద్ కొత్త పార్టీ.. ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. తన సొంత పార్టీని ప్రకటించారు. తను సొంత పార్టీ ప్రారంభిస్తానని మొదటి నుంచి చెప్తున్న ఆయన సోమవారం నాడు పార్టీ పేరు ప్రకటించారు. జమ్ము కశ్మీర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన పార్టీ పేరు ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన ఆయన.. నెలరోజుల తర్వాత కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. తమ పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై ఉంటుందని చెప్పారు.
ఈ పార్టీ పేరు కోసం సుమారు 1500 పేర్లను పరిశీలించడం జరిగిందన్న ఆయన.. ప్రజాస్వామిక, శాంతియుత, స్వతంత్ర్యాలను ప్రతిబింబించేలా పేరు పెట్టాలని అనుకున్నామని చెప్పారు. పార్టీ పేరును ప్రకటించడానికి ముందురోజు ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. తమ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు.













