ముగిసిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు యావత్ దేశం కన్నీటీ వీడ్కోలు పలికింది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్ స్క్వేర్ శ్మశనవాటికలో రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారులు, ప్రముఖుల నివాళుల అనంతరం కటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు జరిపారు. రావత్ దంపతుల భౌతికకాయాలపై కప్పిన త్రివర్ణపతాకాన్ని కుమార్తెలను అందజేశారు. సైనిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. రావత్‌కు గౌరవసూచికంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్ అంత్యక్రియాల్లో 800 మంది సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఆర్డీఓ చీఫ్ జి.సతీశ్ రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు.













