మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు తొలి వారంలో ప్రణబ్ ముఖర్జీకి ఆర్మీ ఆర్ఆర్ డాక్టర్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.













