మాజీ ముఖ్యమంత్రికి షాక్.. నాలుగేళ్ల జైలుశిక్ష
అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలకు నాలుగేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది ఢిల్లీ కి చెందిన సీబీఐ కోర్టు. ఆయనకు 50 లక్షల జరిమానా కూడా విధించింది. మాజీ సీఎం చౌతాలాకు చెందిన నాలుగు ప్రాపర్టీలను కూడా సీజ్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. విచారణ సందర్భంగా కోర్టురూమ్‌కు ప్రత్యక్షంగా చౌతాలా హాజరయ్యారు. ఆక్రమాస్తుల కేసులో స్పెషల్ జడ్జి వికాశ్ దుల్ గత వారమే తీర్పునిస్తూ చౌతాలాను దోషిగా తేల్చారు. 1999 నుంచి 2005 వరకు హరియాణా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరున భారీగా ఆస్తులు కూడబెటినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం 2010లో ఆయనపై సీబీఐ చార్జ్‌షీట్ నమోదు చేసింది. 1993 నుంచి 2006 మధ్య ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్న కేసులలో చౌతాలాను విచారించారు. తాజా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక టీచర్ రిక్రూట్మెంట్లో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన 87 చౌతాలా తిహార్ జైలు నుంచి గతేడాది జూలైలో విడుదలైన సంగతి తెలిసిందే.













