శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్
ఫోర్బస్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్ లో 41వ స్థానంలో నిలిచారు ఆర్థిక మంత్రి. నిర్మలా సీతారామన్‌తో పాటు హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా ఈ జాబితాలో నిలిచిన మిగతా భారతీయు మహిళలు. ఇక ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా పదో సారి ప్రథమ స్థానంలో నిలవగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తొలిసారి ఫోర్బస్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటిసారే ఆమె ఏకంగా మూడో స్థానంలో నిలిచారు.
గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో రోషిణీ నాడార్ 55 స్థానంలో నిలవగా, కిరణ్ మజుందార్ షా 68వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది ఫోర్బస్ జాబితాలో నిలిచిన వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్టైనర్లు ఉన్నారు. వీరందరి వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరణలో విభిన్నంగా ఉన్నప్పటికి.. వారు 2020లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు అని ఫోర్బస్ తెలిపింది.













