దేశ చరిత్రలో అతి విషాదమైన రోజు..
భారత చరిత్రలో 2002 ఫిబ్రవరి 27 అతి విషాదమైన రోజు. గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఎస్-6 కోచ్‌కు దుండగులు నిప్పంటించడంతో 59 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కర సేవకులు. ఈ మత ఉద్రిక్తత గుజరాత్ అంతటా వ్యాపించింది. గోద్రాలోని పాఠశాల, దుకాణాలన్నీ మూసివేసి కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
గోద్రా మరణహోమం అనంతరం గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులతో పాటు మొత్తం 1,044 మంది చనిపోయారు. గోద్రా మరణహోమం జరిగిన మొదటి రోజు అహ్మదాబాద్ గుల్బర్గ్ హౌసింగ్ సొసైటీలో 69 మంది గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి చంపి పారిపోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. మూడవ రోజు నుంచి రాష్ట్రంలోని సైన్యాన్ని మోహరించారు. రాష్ట్రంలో అల్లర్లను నిలువరించేందుకు మోదీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలు ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నరేంద్ర మోదీని కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి. గోద్రా సంఘటనపై దర్యాప్తు చేయడానికి మోదీ ప్రభుత్వం 2002 మార్చి 6న నానవతి-షా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కేజీషా, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జీటీ నానావతి దాని సభ్యులుగా ఉన్నారు. కమిషన్ తన నివేదిక మొదటి భాగాన్ని 2008 సెప్టెంబర్ నెలలో సమర్పించింది. గోద్రా సంఘటనను ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించిన కమిషన్.. నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు, ఉన్నతాధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ కేజీ షా 2009లో మరణించడంతో గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతా సభ్యుడిగా వచ్చారు. ఈ కమిషన్ తన నివేదిక రెండవ భాగాన్ని 2019 డిసెంబర్లో అందజేసింది. ఈ భాగంలో కూడా పాత విషయాలనే పునరావృతం చేశారు.
గోద్రా మరణహోమంలో 31 మంది ముస్లింలను దోషులుగా నిర్ధారించారు. 2011లో సిట్ కోర్టు 11 మంది దోషులకు మరణ శిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. తరువాత 2017లో అక్టోబర్‌లో గుజరాత్ హైకోర్టు 11 మంది దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.













