సరిహద్దుల్లో శాశ్వత గృహాలను నిర్మించుకున్న రైతు సంఘాల నేతలు
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. ఎన్ని రోజులైనా పొలిమేరల్లోంచి జరిగే ప్రసక్తే లేదని రైతులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగా ‘శాశ్వత’ ఏర్పాట్ల దిశగా రైతులు తమ అడుగులు వేస్తున్నారు. ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా టిక్రీ సరిహద్దుల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే 25 ఇళ్లను నిర్మించుకున్నారు. రాబోయే రోజుల్లో 1000 నుంచి 2000 ఇళ్లను నిర్మిస్తామని రైతు సంఘం నేతలు ప్రకటించారు. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని రైతులు అందిస్తున్నారని, లేబర్ ఛార్జీలు మాత్రం ఉచితంగానే అందుతున్నట్లు సమాచారం. అయితే ఇతర సరిహద్దుల్లోనే ఇలాంటి నిర్మాణాలే కొనసాగుతున్నాయని, కిసాన్ సోషల్ ఆర్మీ నాయకుడు అనిల్ మాలిక్ తెలిపారు.













