సంతృప్తిగానే వెళుతున్నాను : జస్టిస్ బోబ్డే
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీ కాలం అత్యంత సంతృప్తిగా, సంతోషంగా సాగిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు. సీజేగా తన శక్తి మేర విధులు నిర్వర్తించానని, సంతృప్తితోనే పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ బోబ్డేకు వీడ్కోలు పలికారు. ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు, సంతోషం, సద్భావనతో సుప్రీంను విడిచి వెళ్తున్నానని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా 21 సంవత్సరాలు విధులు నిర్వర్తించిన తర్వాత పదవి నుంచి వైదొలుగుతున్నానని, ఈ కాలం చాలా జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. తన స్థానంలో సీజేఐగా బాధ్యతలు చేపడుతున్న జస్టిస్ ఎన్వీ రమణ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా యువ న్యాయవాదులు నిరుత్సాహపడకూడదని పేర్కొన్నారు. ‘‘ఆశలను కోల్పోకండి. విధి నిర్వహణను కొనసాగించండి. పరిస్థితులు తప్పకుండా మారతాయి’’ అని జస్టిస్ బోబ్డే భరోసా నింపే ప్రయత్నం చేశారు.













