ఆంగ్లం వస్తేనే అభివృద్ది అనడం సరికాదు : ఉపరాష్ట్రపతి
ఆంగ్లభాష ద్వారా మాత్రమే అభివృద్ది అనడం సరికాదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ‘జ్హాన సముపార్జన మాధ్యమం-మాతృభాష’ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ ప్రారంభ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నాలుగు వేల ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే భాషకు సంబంధించిన వాస్తవం అర్థమవుతుందన్నారు. అమృతం లాంటి మాతృభాష రేపటి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషకే అగ్రతాంబూలం. మాతృభాషలో పరిశోధన చేసిన వారికే నోబెల్ బహుమతులు వచ్చాయి. అనేకమంది విదేశీ నేతలు మాతృభాషలోనే మాట్లాడతారు. ఆంగ్లం వచ్చినా అనేకమంది అగ్రనేతలు వారి మాతృభాషే మాట్లాడతారు. జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది. సామాన్య ప్రజలకు అర్ధమయ్యే భాషలోనే పరిపాలన జరగాలి. అన్ని రాష్ట్రాలూ అధికార భాషను మరింత ప్రోత్సహించాలి.
ప్రపంచంలో 90 శాతం దేశాలు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి. మాతృభాష ద్వారానే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. తెలుగు మాతృభాషగా కలిగిన నవతరం చిన్నారులు పెద్దబాలశిక్ష, వేమన, సుమతి శతకాలు చదవాలి. మాతృభాషను మరింత లోతుగా పరిశీలిస్తే ఎన్నో పదాలు అవగతమవుతాయి. మాతృభాషను ఉపాధి రంగంతో అనుసంధానం చేయాలి. వివిధ రంగాల అవసరాలు తీర్చేలా మారిస్తేనే మాతృభాషలకు మనుగడ. సాంకేతిక నిపుణులు కూడా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారత్లో ఉన్నన్ని భాషలు మరో దేశంలో లేవు. అందుకే కరోనా వేళ సురక్షిత దూరం, స్వీయనియంత్రణ పదాలు సృష్టించాం’’ అని వెంకయ్యనాయుడు వివరించారు.













