హామీలు ఎలా నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలి.. ప్రవర్తన నియమావళిలో మార్పులు సూచించిన ఎలక్షన్ కమిషన్
ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని పాటించకుండా కొందరు గాలికి వదిలేస్తే.. మరికొందరు మిగతా విషయాల్లో ప్రజలపై భారం మోపి తమ హామీలు నెరవేరుస్తుంటారు. ఇలా చేయడం వల్ల ప్రజలకే నష్టం. ఈ పరిస్థితిని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నడుం బిగించింది. ఎన్నికల సమయంలో నేతలు పాటించవలసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి లో దీనికోసం సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు తాము చేసిన ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరింది. ఎన్నికల ప్రణాళికలలో పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, వాటి కోసం అయ్యే ఖర్చు విషయంలో అనుమానాలను తొలగించేందుకే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలు పారదర్శకంగా ఉండాలని, ఇవి ఎలా నిలబెట్టుకుంటారో ప్రజలకు తెలిసే విధంగా చూడాలనే లక్ష్యంతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి మార్గదర్శకాలను సవరించాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. దీనికోసం ఎన్నికల నియమావళికి ఒక స్థిరమైన విధానాన్ని జత చేయాలని ప్రతిపాదించింది. గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు మంగళవారం నాడు వీటిని తెలుపుతూ లేఖ రాసింది. ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే హామీల హేతుబద్ధత, వాటిని అమలు చేయడానికి నిధులు ఎలా సేకరిస్తారు? తదితర విషయాలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వివరించాలని, ప్రజలకు ఈ విషయాలు తెలియాలని ఎన్నికల ప్రవర్తన నియమావళిలో స్పష్టంగా ఉంది. కానీ ఎవరూ ఈ నియమాలను సరిగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే పార్టీలు, అభ్యర్థులు తమకు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో ఇలాంటి హామీల గురించి పూర్తిగా తెలుసుకొని, ఆ తర్వాత ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఓటరుకు ఉంటుంది. దీనికోసం అవసరమైన సమాచారాన్ని సదరు పార్టీలు, నేతలు ఓటర్లకు ఇవ్వడం లేదని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అందుకే ప్రవర్తన నియమావళిలో మార్పులు సూచించినట్లు తెలుస్తోంది.













